శాంతి చర్చలకు సిద్ధమే మావొయిస్ట్ పార్టీ

శాంతి చర్చలకు సిద్ధమే మావొయిస్ట్ పార్టీ

కాల్పుల విరమణ ప్రకటించి శాంతి చర్చలు జరుపండి 
సీపీఐ మావోయిస్ట్ అధికార ప్రతినిధి అభయ్

చురకలు ప్రతి నిధి

'మధ్యభారతంలో జరుగుతున్న యుద్ధాన్ని వెంటనే ఆపాలని, భారత ప్రభుత్వం- సీపీఐ (మావోయిస్టు) బేషరతుగా కాల్పుల విరమణ ప్రకటించి శాంతి చర్చలు జరపాలని ' అనే అంశంపై మార్చి 24న హైదరాబాద్ లో శాంతి చర్చల కమిటీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిందని నేటి స్థితిలో శాంతి చర్చల కమిటీ ఏర్పాటును, అది శాంతి కోసం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడాన్ని స్వాగతిస్తున్నాట్లు మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఒక ప్రకటనలో తెలిపారు.. ఈ సందర్భంగా, శాంతి చర్చల పట్ల మావోయూస్ట్ పార్టీ వైఖరిని తెలిపారు.

2024 జనవరిలో, బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు బీజేపీ కేంద్ర ప్రభుత్వం, విప్లవోద్యమ ప్రభావిత రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి 'కగార్' పేరుతో విప్లవోద్యమ ప్రభావిత రాష్ట్రాల ప్రజలపై ప్రతిఘాతక యుద్ధాన్ని ప్రారంభించాయని,. ఆ సమయంలో ప్రజల్ని మోసగించడానికి ఛత్తీస్ గఢ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి/హోంమంత్రి విజయ్ శర్మ  ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరపడానికి సిద్ధమే, మావోయిస్టులు చర్చలకు రావాలి' అని పదే పదే ప్రకటనలు చేసారని పేర్కొన్నారు. ఆ సందర్భంగా  పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మీడియా ప్రతినిధి కామ్రేడ్ వికల్ప్ రెండు సార్లు పార్టీ శాంతి చర్చలకు సిద్ధమేనని తెలియజేసారని,శాంతి చర్చల కోసం సానుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేయడం కోసం, 'కగార్' పేరుతో ఆదివాసీ ప్రజానీకంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న హత్యాకాండను నిలిపివేయాలని, బస్తర్ ప్రాంతంలో మోహరించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సాయుధ బలగాలను బ్యారక్ లకే పరిమితం చేయాలని, సాయుధ బలగాల కొత్త క్యాంపుల ఏర్పాటును నిలిపివేయాలని కేంద్ర. రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రతిపాదన చేసారని గుర్తు చేశారు. ఈ ప్రతిపాదన పట్ల స్పందించకుండా, జవాబు ఇవ్వకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గత 15 నెలలుగా విప్లవోద్యమ ప్రభావిత రాష్ట్రాలన్నింటా, ముఖ్యంగా ఛత్తీస్ గఢ్ లో ప్రతిఘాతక 'కగార్' యుద్ధాన్ని తీవ్రంగా కొనసాగిస్తున్నాయని ఆరోపించారు.ఈ యుద్ధంలో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 400కు పైబడిన సంఖ్యలో  పార్టీ నాయకులను, కార్యకర్తలను, ప్రజా విముక్తి గెరిల్లా సైన్యానికి చెందిన వివిధ స్థాయిల కమాండర్లను, సభ్యులను, సాధారణ ఆదివాసీ ప్రజానీకాన్ని హత్య చేసాయని ఆరోపించారు. ఇందులో 1/3 సంఖ్యలో సాధారణ ఆదివాసీ ప్రజలు హత్య చేయబడ్డారని,విప్లవోద్యమ ప్రాంతాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సాయుధ బలగాలు వేలాది మందిని అరెస్టులు చేసి అక్రమ కేసులు మోపి జైళ్ల పాలు చేస్తున్నారని ఆరోపించారు..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పథకం ప్రకారమే సాధారణ ప్రజానీకాన్ని హత్య చేస్తున్నాయని, చుట్టివేసి చంపివేసే (కార్టన్ అండ్ కిల్) ఆపరేషన్లలో చిక్కుకుంటున్న మా పార్టీకి, పీ.ఎల్.జీ.ఏ.కు చెందిన నిరాయుధ సభ్యులను, గాయపడి శత్రు సాయుధ బలగాలకు చిక్కిన సభ్యులను అమానవీయ చిత్రహింసలకు గురిచేసి హత్య చేస్తున్నాయని, మహిళా కామ్రేడ్స్ ను సామూహిక అత్యాచారాలు చేసి హత్య చేస్తున్నాయని,అందుకే ఈ యుద్దాన్ని సరసంహారం (జీనోసైడ్) అంటున్నామని పేర్కొన్నారు. ఈ యుద్ధంలో కేంద్ర ప్రభుత్వం కమాండో బలగాల ముసుగులో భారత సైన్యాన్ని మోహరించిందని, విప్లవోద్యమ ప్రాంతాన్ని కల్లోలిత ప్రాంతంగా ప్రకటించకుండానే అంతర్గత భద్రత కోసం సైన్యాన్ని ఉపయోగించడం రాజ్యాంగ వ్యతిరేకమని,కల్లోలిత ప్రాంతాలుగా ప్రకటించి గానీ, ప్రకటించక గానీ స్వంత దేశ ప్రజలపై సైన్యాన్ని ఉపయోగించడం రాజ్యాంగపు మౌలిక భావనలకే వ్యతిరేకమన్నారు. సామ్రాజ్యవాదుల, దళారీ పెట్టుబడిదార్ల, భూస్వాముల దోపిడీ, పీడనలను సుస్థిరం చేయడం కోసమే, 'హిందూ రాష్ట్ర' ఏర్పాటు కోసమే బీజేపీ పాలిత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కగార్ యుద్ధాన్ని కొనసాగిస్తున్నాయని ఆరోపించారు. దోపిడీ వర్గాలకు ప్రాతినిధ్యం వహించే ఇతర రాజకీయ పార్టీల రాష్ట్ర ప్రభుత్వాలు ఇందులో భాగస్వాములుగా ఉన్నాయని పేర్కొన్నారు. బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు ఆర్ఎస్ఎస్-బీజేపీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్మించ తలపెట్టిన 'వికసిత్ భారత్-హిందూరాష్ట్ర' ఎలా ఉంటుందనేది కగార్ యుద్ధం ద్వారా స్పష్టమవుతోందన్నారు. అది ఆదివాసుల, పేదల రక్తపుమడుగుల పునాదులపై నిర్మాణమవుతోందని,అది రేపు దేశంలోని రైతాంగపు భూముల్ని, ప్రాకృతిక వనరులను, మార్కెట్ ను, ప్రభుత్వ రంగ సంస్థలను దేశ, విదేశీ కార్పొరేట్లకు కట్టబెడుతుందని పేర్కొన్నారు. మతమైనారిటీలపై వివక్షతను రాజ్యాంగబద్ధం చేస్తుందని, సమాఖ్య వ్యవస్థను నాశనం చేసి నియంతృత్వ కేంద్ర ప్రభుత్వాన్ని (ఆటోక్రటిక్ యూనిటరీ స్టేట్ ను) నిర్మిస్తుందని,తూర్పు, మధ్యభారతంలో మా పార్టీ నాయకత్వంలో ఆదివాసులు, వారితోపాటు తరతరాలుగా నివాసముంటున్న గైరాదివాసీ పేద ప్రజానీకం తమ జల్, జంగల్, జమీన్ పై అధికారం కోసం, స్వయంపాలన (అటానమీ) కోసం, తమ సంస్కృతి-సాంప్రదాయాల రక్షణ కోసం, తమ మాతృ భాషల రక్షణ కోసం, పర్యావరణ పరిరక్షణ కోసం మొత్తంగా సామ్రాజ్యవాద, దళారీ
పెట్టుబడిదారీ, భూస్వామ్య వ్యవస్థను కూలదోసి సమసమాజ స్థాపన కోసం పోరాడుతుంటే బీజేపీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర పార్టీల రాష్ట్ర ప్రభుత్వాలు ఆ ప్రజాపోరాటాలను నిర్మూలించడం కోసం తూర్పు, మధ్యభారతంలో కగార్ యుద్ధాన్ని కొనసాగిస్తున్నాయని పేర్కొన్నారు. సామ్రాజ్యవాదుల, దళారీ పెట్టుబడిదార్ల, భూస్వాముల దోపిడీ, పీడనల నుండి దేశంలోని పీడిత ప్రజల, పీడిత సాంఘిక సముదాయాల, పీడితజాతుల విముక్తి కోసం మా పార్టీ పోరాడుతుంటే ఆ పోరాటాలను అణచివేయడానికి పట్టణాల్లో, మైదానాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాయుధ పోలీసు బలగాల్ని, ఎన్ఐఏ లాంటి ఇంటలిజెన్స్ ఏజెన్సీలను ఉపయోగించి పోరాడే ప్రజానీకంపై దాడులు చేస్తున్నాయని ఆరోపించారు. ప్రజాపక్ష మేధావులపై భీమాకోరేగావ్ కుట్ర కేసును మోపి జైళ్లో బంధించాయని, సంక్షిప్తంగా చెప్పాలంటే, దేశంలోని సకల పీడిత ప్రజలపై, పీడిత సాంఘిక సముదాయాలపై, పీడిత జాతులపై సామ్రాజ్యవాదులు, దళారీ పెట్టుబడిదార్లు, భూస్వాములు సాగించే దోపిడీ, పీడనలకు వ్యతిరేకంగా మా పార్టీ పోరాడుతుంటే, ఈ దోపిడీ పాలకవర్గాల దోపిడీ, పీడనలను సుస్థిరం చేయడానికి బీజేపీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర పార్టీల రాష్ట్ర ప్రభుత్వాలు దేశ ప్రజలపై కగార్ పేరుతో యుద్ధాన్ని కొనసాగిస్తున్నాయని అభయ్ పేర్కొన్నారు.విప్లవోద్యమ ప్రాంతాల్లో ఆదివాసీ యువతి యువకులను సాయుధ బలగాల్లో భర్తీ చేసుకుని వారిచేతనే ఆదివాసులను హత్యలు చేయిస్తున్నాయని,
ఈ స్థితిలో ప్రజల ప్రయోజనాల కోసం మేము ఎప్పుడైనా శాంతి చర్చలకు సిద్ధమేనని, అందుకే శాంతి చర్చల కోసం సానుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ముందు ప్రతిపాదన చేస్తున్నాట్లు అభయ్ పేర్కొన్నారు. అందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కగార్ పేరుతో ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర (గడ్చిరోలీ), ఒడిశా, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చేస్తున్న హత్యకాండలను, నరసంహారాన్ని (జీనోసైడ్)ను నిలిపివేయాలని, సాయుధ బలగాల కొత్త క్యాంపుల ఏర్పాటును ఆపివేయాలని ప్రతిపాదిస్తునట్లు పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందిస్తే మేం తక్షణమే కాల్పుల విరమణ ప్రకటిస్తామని,
తాము చేస్తున్న ఈ ప్రతిపాదనల ఆధారంగా శాంతి చర్చల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుక రావాలని శాంతి చర్చల కమిటీకి, దేశంలోని ప్రజాపక్ష మేధావులకు, రచయితలకు, ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా జర్నలిస్టులకు, హక్కుల సంఘాలకు, ఆదివాసీ, దళిత సంఘాలకు, విద్యార్థి-యువజనులకు, పర్యావరణ కార్యకర్తలకు తదితరులందరికీ  అభయ్ విజ్ఞప్తి చేశారు. శాంతి చర్చల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేలా దేశవ్యాప్తంగా అన్ని పట్టణాల్లో, నగరాల్లో, జిల్లా, తాలూకా కేంద్రాల్లో, యూనివర్సిటీల్లో ప్రచార క్యాంపెయిన్ ను చేపట్టాల్సిందిగా కోరారు.IMG-20250402-WA0018

Tags: