గంజాయి సాగుచేస్తున్న వ్యక్తీ అరెస్ట్
గంజాయి సాగు చేస్తున్న వ్యక్తి అరెస్టు.
వివరాలు వెల్లడించిన సారంగాపూర్ ఎస్ఐ దత్తాద్రి.
చురకలు ప్రతినిధి, జగిత్యాల, నవంబర్ 21 : జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం రేచపల్లి లో గంజాయి సాగు చేస్తున్న పోతుగంటి తిరుపతి అనే వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు సారంగాపూర్ ఎస్ఐ దత్తాద్రి తెలిపారు. గురువారం సారంగాపూర్ పోలీస్ స్టేషన్ లో విలేకరులతో మాట్లాడుతూ పోతుగంటి తిరుపతి తన పొలంలో గంజాయి సాగు చేస్తున్నట్లు తెలిసి గురువారం పోలీస్ సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించామని తెలిపారు. పోతుగంటి తిరుపతి పొలం నుండి 17.39 కిలోల పచ్చి గంజాయి, 300 గ్రాముల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నామని,
దీని విలువ 97500 ఉంటుందని తెలిపారు. గంజాయి సాగు చేస్తున్న పోతుగంటి తిరుపతి పై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించామని వివరించారు.
గంజాయి సేవించడం, సరఫరా చేయడం, విక్రయించడం, సాగు చేయడం చట్టరీత్యా నేరమని, గంజాయి సేవిస్తున్న, సరఫరా చేస్తున్న, విక్రయిస్తున్న, సాగు చేస్తున్న వివరాలు తెలిసితే పోలీస్ స్టేషన్ లో సమాచారం అందించాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. ఈ సమావేశంలో పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.