భక్తులకు ఎలాంటి భద్రతాపరమైన ఇబ్బందులు లేకుండా చూడాలి జిల్లా ఎస్పి అశోక్ కుమార్
భక్తులకు ఎలాంటి భద్రతాపరమైన ఇబ్బందులు లేకుండా చూడాలి.
భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
చురకలు విలేకరి, జగిత్యాల, డిసెంబర్ 5: గొల్ల పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లనపేట గ్రామంలో గల ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మల్లికార్జున స్వామి (మల్లన్న పేట జాతర) సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అధికారులను ఆదేశించారు. డిసెంబర్ 6 తేదీ నుండి డిసెంబర్ 29వ తేదీ వరకు జరుగు జాతర సందర్భంగా ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉందని, ఏలాంటి నేరాలకు తావులేకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఆలయ పరిసరాల్లో, క్యూలైన్లలో, వాహనాల రాకపోకలు మొదలైన ప్రదేశాల్లో ఏర్పాటు చేయవలసిన భద్రత ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అదేవిధంగా ఆలయ పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఎస్పీ శ్రీమల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి రఘు చందర్, ఎస్ఐ సతీష్ తదితరులు పాల్గొన్నారు.