సామంతుల స్వగృహ హోటల్ అన్నంలో ఇనుప పీచు
సామంతుల స్వగృహ భోజనశాలలో తినే అన్నంలో ఇనుప పీచు (స్క్రబ్బర్) తీగ
జగిత్యాల హోటల్లో వెలుగు చూసిన మరో ఉదంతం
- మొన్న జెర్రి, నిన్న బొద్దింక, నేడు ఇనుప తీగ ,హోటల్ నిర్వాహకుల నిర్వాకం ఇదేనా?
సాయి వి.
చురకలు విలేఖరి,
జగిత్యాల, రూరల్ ,నవంబర్ 13.
జగిత్యాల పట్టణంలోని తహసీల్ చౌరస్తాకు కూత వేటు దూరంలో ఉన్న సామంతుల స్వగృహ భోజనశాలలో కొందరు వ్యక్తులు భోజనం చేస్తుండగా తినే అన్నంలో బోళ్లను తోమే ఇనుప పీచు తీగ కనిపించడంతో తినే వ్యక్తితో పాటు అక్కడే ఉన్న కస్టమర్స్ భయాందోళనకు గురయ్యారు. విషయం గమనించిన కస్టమర్స్ అక్కడే ఉన్న సంబంధిత హోటల్ ఇన్చార్జిని పిలిచి విచారించగా బోళ్లను తోమే సమయంలో వచ్చినట్టు ఉంది అని సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు. బోళ్ళు తోమే క్రమంలో తినే అన్నంలో గాని తినే కర్రీలో గాని ఎలా వస్తుంది, బోళ్ళు తోమిన తర్వాత మంచి నీటితో శుభ్రం చేస్తే స్క్రబ్బర్ ఇనుప తీగలు తినే పదార్థాలలోకి ఎలా వస్తాయని నిలదీయగా అక్కడే ఉన్న ఆ హోటల్ యజమాని ఇలాంటి సంఘటనలు అప్పుడప్పుడు జరుగుతాయి. వచ్చిన వాళ్ళు చూసి చూడనట్లుగా వదిలేయాలని ఆ ఇనప తీగను మీరు ఇంకా తిని మింగలేదు కదా, ఇంతదానికే ఏమైందంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తూ మీ దిక్కు ఉన్న చోటు చెప్పుకోండి మమ్మల్ని ఏ అధికారి ఏమీ చేయలేరు. ఇలాంటి సంఘటనలు ప్రజలు రెండు మూడు రోజుల్లో మరిచిపోతారని ఆపై సదా యధా విధంగా జరుగుతుందని బదులిస్తూ దబాయించగా అక్కడే ఉన్న కస్టమర్లు చేసేది ఏమీ లేక హోటల్ నిర్వాహకుల నిర్వాకాన్ని చూస్తూ నిలుచుండిపోయారు. ఇలా ఎవరికి వారు జెర్రీలను, బొద్దింకలను, ఇనుప తీగలను వచ్చిన కస్టమర్లకు తినిపిస్తే వారి ఆరోగ్య పరిస్థితి ఏంటి అని ప్రజలు వాపోతున్నారు. ఇకనైనా ఫుడ్ ఇన్స్పెక్టర్, జిల్లా స్థాయి ఉన్నతాధికారులు, కలెక్టర్ హోటళ్ల నిర్వాకంపై దృష్టి సారించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని నాణ్యమైన ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.